2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : ఐఎమ్ఎఫ్

భారత దేశ ఆర్థిక విజయం ఇప్పటిదాకా చేపట్టిన సంస్కరణల్లో దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని భారత్ సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2024 భారత వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపరచడం విశేషం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే క్రిస్టలినా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రకాశిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది కూడా. 2024 భారత వృద్ధి అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ 2023లో చాలా బలమైన పనితీరు కనబరచిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆమె వివరించారు. డిజిటలీకరణ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రయోజనాన్ని చేకూర్చాయని తెలిపారు. ఇదే ఇప్పుడు దేశానికి బలమైన శక్తిగా మారిందని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు సైతం మార్కెట్లోకి ప్రవేశించేందుకు డిజిటల్ వసతులు దోహదం చేశాయన్నారు.