మరో గ్లోబల్ దిగ్గజ సంస్థకు.. సారథిగా భారతీయుడు
అమెరికా బహుళజాతి సంస్థ, కాపీ వ్యాపార దిగ్గజం స్టార్ బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. దీంతో అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో నరసింహన్ పేరు కూడా చేరినట్లైంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1న సీఈవోగా స్టార్‌బక్స్‌లో నరసింహన్ చేరనున్నారని ఆ సంస్థ తెలియజేసింది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ డైరెక్టర్ల బోర్డులోకి నరసింహన్ వెళ్లనున్నారు. అప్పటిదాక ఇప్పుడున్న మధ్యంతర సీఈవో హోవర్డ్ చల్ట్తో కలిసి నరసింహన్ పనిచేస్తారని స్టార్‌బక్స్ ప్రకటించింది.
నరసింహన్ ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన బహుళజాతి ఆరోగ్య, పోషకాల కంపెనీ రెకిట్ బెన్కిసర్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 30న ఈ బాధ్యతల నుంచి నరసింహన్ వైదొలుగుతారని రెకిట్ బెన్కిసర్ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. గతంలో నరసింహన్ పెప్సీకో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా కూడా పని చేశారు. ఇదిలా వుంటే స్టార్‌బక్స్ నాయకత్వ బాధ్యతలు అందుకోగలిగిన సరైన వ్యక్తి నరసింహనేనని ఈ సంస్థ మధ్యంతర సీఈవో హోవర్డ్ అన్నారు. ఇక ఈ అవకాశం రావడం పట్ల నరసింహన్ ఆనందం వ్యక్తం చేశారు.






