అమెరికాకు చెక్ పెట్టేందుకు.. రష్యా కొత్త ఎత్తుగడ
అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు రష్యా సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని అనుమతించే దిశగా రష్యా ఆర్థిక శాఖ, బ్యాంక్ ఆఫ్ రష్యా యోచిస్తున్నాయని సమాచారం. తద్వారా ఆ దేశం క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించినట్లవుతుంది. ప్రస్తుత గోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యంలో క్రిప్టోల ద్వారా చెల్లింపులు అనివార్యమని బ్యాంక్ ఆఫ్ రష్యా భావిస్తున్నదని తెలిసింది. అంతేకాదు, క్రిప్టోల నియంత్రణ విషయం లోనూ రస్యా సెంట్రల్ బ్యాంక్ వైఖరి మారిందని, ఇతర దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో వాటిని సైతం అనుమతించే దిశగా ఆర్థిక శాఖతో కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. అందుకు ప్రతీకారంగా యూరప్‌కు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యా, తమ ఎగుమతులకు రూబుళ్లలో చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది.






