జుకర్‌బర్గ్ కు భారీ షాక్…కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి
ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఈ ఏడాది భారీగా పడిపోయింది. 2022 ఆరంభం నుంచి ఆయన నికర సంపదలో 71 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.5.65 లక్షల కోట్లు. బ్లూమ్‌బెర్గ్ కుబేరుల జాబితాలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆయన 20వ స్థానంలో ఉన్నారు. 2014 తర్వాత ఆయన ర్యాంకు ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం జుకర్‌బర్గ్ సంపద 106 బిలియన్ డాలర్లు (రూ.8.44 కోట్లు). బిలియనీర్ల జాబితాలో బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్ మాత్రమే ఈయన కంటే ముందుండేవారు.
గత ఏడాది సెప్టెంబరులో జుకర్‌బర్గ్ సంపద 142 బిలియన్ డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఫేస్బుక్ షేరు ధర 382 డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరడం ఇందుకు దోహం చేసింది.గత ఏడాది అక్టోబరులో మెటా కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. కంపెనీ పేరును ఫేస్బుక్ నుంచి మెటాగా మార్చారు. అప్పటి నుంచి జుకర్‌బర్గ్ సంపద కుంగడం ప్రారంభమైంది. నెలవారీ యూజర్ల సంఖ్యలో ఎలాంటి వృద్ధి లేదని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దీంతో షేరు విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.






