లింక్డ్ఇన్, సత్య నాదెళ్ల సహా 10 మందికి జరిమానా

కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెళ్లతో పాటు మరో ఎనిమిది మందిపై కార్పొరేట్ వ్యవహారాల వాఖ అపరాధ రుసుము విధించింది. కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ (ఎస్‌బీఓ) నిబంధనలను లింక్డ్‌ఇన్‌తో పాటు ఇతరులు ఉల్లంఘించారని రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్ (ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ, హరియాణా) స్పష్టం చేసింది. సత్య నాదెళ్ల, లింక్డ్‌ఇన్ కార్పొరేషన్ గ్లోబల్ సీఈఓ రియాన్ రోస్లాన్‌స్కై ఆ కంపెనీకి ఎస్‌బీఓలు. సెక్షన్ 90(1) కింద కొన్ని అంశాలను నివేదించడంలో విఫలం కావడంతో రూ.27,10,800 అపరాధ రుసుము కట్టాలి అని తన ఆదేశాల్లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) వెల్లడించింది. లింక్డ్‌ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, నాదెళ్ల, రియాన్‌లపై రూ.2 లక్షల చొప్పున ఫైన్ వేశారు. మరో ఏడుగురు కంపెనీ అధికారులపైనా జరిమానా విధించారు.