అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన సంపదపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదలో అత్యధిక భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేస్తానని వెల్లడించారు. 124 బిలియన్ డాలర్ల నికర సంపద కలిగిన బెజోస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అత్యంత ధనికుల్లో ఒకడై ఉండి కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక్క పైసా ఇవ్వడం లేదని బెజోస్పై ఇటీవల విమర్శలు వస్తుండేవి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ప్రపంచ క్షేమం కోసం కోరి పెద్ద మొత్తంలో చారిటీలకు విరాళాలు ఇస్తుంటే, బెజోస్ మాత్రం వ్యాపార చట్టం నుంచి బయటికి రావడం లేదని వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు ఆ విమర్శలకు బెజోస్ తన ప్రకటనతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తన ఆస్తిలో మెజారిటీ వాటాను వాతావరణ మార్పులపై పోరాటానికి అందజేస్తానని బెజోస్ తెలిపారు. అంతే కాదు సామాజికంగా, రాజకీయంగా తీవ్ర స్థాయిలో విడిపోయిన మానవత్వాన్ని తిరిగి ఏకం చేయగల వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు తన ఆస్తిని వినియోగిస్తానని కూడా ఆయన తెలిపారు. కాగా, బెజోస్ తన విరాళాలకు కాల పరిమితి విధించలేదు. తన సంపదలో అత్యధిక భాగాన్ని తన జీవిత కాలంలో విరాళంగా ఇచ్చేస్తాని ఆయన తెలిపారు.






