Jaguar Land Rover: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎగుమతులు బ్రేక్!

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover ) బ్రిటన్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తమ దేశంలోకి దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ట్రంప్ సుంకాలను ఎలా తగ్గించుకోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్ (Britain) లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్‌ఆర్ సంస్థ బ్రిటన్‌లో సుమారు 38 వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో వల్ల కలిగే ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవడంపై ప్రస్తుతం ఆలోచన చేస్తోందని, ఓ నెల రోజుల పాటు ఎగుమతులు నిలిపివేయాలని పేర్కొంది. రాబోయే రెండు నెలలకు సరిపడ్డా కార్లను అమెరికా (America) కు ఇప్పటికే ఆ కంపెనీ ఎగుమతి చేసింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఒక్క జేఎల్‌ఆర్ మాత్రమే కాదు, ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీలూ వ్యాపార వ్యూహాల గురించి ఆలోచన చేస్తున్నాయి. 2024 మార్చి 12 నెలల వ్యవధిలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4.30 లక్షల వాహనాలను విక్రయించగా, అందులో నాలుగో వంతు అమెరికాలో అమ్ముడయ్యాయి. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్లు పతనం అవ్వడానికి కారణం కూడా ఇదే.