Stampedes: ఆలయాల్లో తొక్కిసలాటలు.. లోపం ఎక్కడుంది?
ఆలయాల్లో (Temples) వరుసగా జరుగుతున్న తొక్కిసలాటలు విషాదం నింపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) తిరుపతి, సింహాచలం, తాజాగా కాశీబుగ్గ (Kasibugga) వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న మరణాలు ఆందోళనకరంగా మారాయి. పాలనాపరంగా నెలకొన్న లోపాలను, భక్తుల ప్రవర్తనలోని కొన్ని అంశాలను ఇవి లేవనెత్తుతున్నాయి. ఈ ఘోర విషాదాలను కేవలం ప్రమాదాలుగా చూడకుండా.. నిర్వహణ లోపం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే సమయంలో ఆధ్యాత్మిక ఉద్వేగంలో భక్తులు విచక్షణ కోల్పోవడం కూడా సమస్యలకు కారణమవుతోంది.
తొక్కిసలాటలకు ప్రధాన కారణం నిర్వహణ లోపం. పుణ్య దినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా, దానికి తగిన ఏర్పాట్లు చేయట్లేదు. రద్దీని తక్కువగా అంచనా వేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భక్తుల సంఖ్యకు తగినట్లుగా క్యూ లైన్లు, బయటకు వెళ్లే ద్వారాలు ఉండట్లేదు. కొన్ని ఆలయాల్లో కనీస సదుపాయాలు కూడా ఉండవు. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ అస్సలు లేదు. తగినంత మంది శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది లేరు. రద్దీ నిర్వహణపై అవగాహన లేని వాళ్లను వాలంటీర్లుగా పెట్టుకోవడం కూడా సమస్యకు కారణమవుతోంది.
సహజంగా ఒక చదరపు మీటరుకు ముగ్గురు, నలుగురు మాత్రమే ఉండాలి. కానీ అది కూడా క్యూలైన్ పటిష్టంగా ఉన్నప్పుడే కంట్రోల్ చేసేందుకు వీలవుతుంది. కానీ చదరపు మీటరుకు 5-7 మందికి మించి భక్తులు చొరబడుతున్నారు. ఈ జనసాంద్రతను నియంత్రించడంలో ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతున్నాయి. కాశీబుగ్గ వంటి ప్రైవేట్ ఆలయాలు ప్రభుత్వ పర్యవేక్షణలో లేకపోవడం కూడా ఇబ్బందే. భద్రతా ప్రమాణాలు పాటించడంలో వీటికి అంత అనుభవం ఉండకపోవచ్చు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఉండరు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్వహణ చేపట్టడం వల్ల భక్తుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తోంది.
భక్తుల వేలంవెర్రి ప్రవర్తన కూడా తొక్కిసలాటకు మరో కారణం. పుణ్య సమయం దాటిపోతుందనే కంగారు లేదంటే ముందుగానే దర్శనం చేసుకోవాలనే అత్యుత్సాహం భక్తులలో ప్యానిక్ కి దారితీస్తోంది. ఇలాంటివి తోపులాటకు దారి తీస్తున్నాయి. క్రమశిక్షణ పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు దూకడం వల్ల తొక్కిసలాటలు మొదలవుతాయి. భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోయినా, వ్యక్తిగతంగా భక్తులు సంయమనం కోల్పోవడం వల్ల విషాదాలు తీవ్రమవుతాయి. VIP, VVIP దర్శనాలు, అధిక ధర టిక్కెట్లు కొనుక్కున్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వలన సాధారణ భక్తులలో అసహనం పెరిగిపోతుంది. అలాంటప్పుడు వాళ్లు వేగంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. దేవుడి ముందు అందరూ సమానమే అనే భావన ఆచరణలో లేకపోవడం కూడా ఒక సామాజిక సంకేతం.
ఈ వరుస ఘటనలు భక్తుల ప్రాణాల పట్ల వ్యవస్థాపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తున్నాయి. వీటి నుంచి అయినా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆలయాల నిర్వాహకులు.. అది ప్రైవేటు అయినా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా, భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా తగిన భద్రత, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. తొక్కిసలాటలను నివారించడానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ముఖ్యంగా రద్దీ నియంత్రణకు స్నేక్-లైన్ పద్ధతి అనువైనది. దీంతోపాటు అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు, అత్యవసర వైద్య సదుపాయాలు వంటివి తప్పనిసరి చేయాలి. అన్నిటికీ మించి ఆలయ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలి. భక్తులు కూడా సహనం, క్రమశిక్షణ పాటించాలి. వేలంవెర్రిగా ఎగబడడం మానేసి, తోటి భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.







