బ్రిటన్ను వెనక్కు నెట్టిన ఇండియా… ఇప్పుడు ప్రపంచంలోనే
జీడీపీపరంగా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను మించిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటన్ వలస పాలనలో మగ్గిన భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఐఎంఎఫ్ గణాంకాల ఆధారంగా చూస్తే 2021 డిసెంబరు నాటికే భారత ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి చేరింది. ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎదిగి 85,407 కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లుగా ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాలు ఆర్థికంగా ఆపసోపాలు పడుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం విశేషం. ఆర్థిక కష్టాలతో బ్రిటన్ మరింత చితికిపోతుందని భావిస్తున్నారు. జీడీపీపరంగా చూస్తే ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ మాత్రమే మన దేశానికంటే ముందున్నాయి.






