Mobile phones : ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్

ఒకప్పుడు మొబైల్ ఫోన్లు (Mobile phones) అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ (India) , ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే కీలక దేశాల్లో ఒకటిగా ఎదిగింది. కేవలం గతేడాది 20.5 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసి ప్రపంచంలోనే మూడో దేశంగా నిలిచింది. దశాబ్దం కంటే తక్కువ వ్యవధిలో భారత్ ఈ ఘనత సాధించడం గొప్ప విషయమని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్(సీడీఎస్) అధ్యయనం వెల్లడిరచింది. ఇందుకు పీఎల్‌ఐ వంటి విధానపరమైన నిర్ణయాలు దోహదపడినట్లు తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతుల పురోగతికి సంబంధించి సీడీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరమణి (Veeramani) నేతృత్వంలో ఓ అధ్యయనం జరిగింది. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు 2020లో ప్రారంభించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం మరింత దోహదం చేసినట్టు అధ్యయనం పేర్కొంది. ఆసియా (Asia) లోని పలు ఆర్థిక వ్యవస్థల మాదిరిగా వేగంగా ముందుకెళ్తూ అనతికాలంలోనే పురోగతి సాధించిన మొబైల్ ఫోన్ల తయారీ వృద్ధికి ఓ బ్లూప్రింట్‌గా నిలిచిందని అధ్యయనం తెలిపింది.