H1b Visa: 24 గంటల్లో అమెరికా వచ్చేయాలి.. హెచ్1బీ ఉద్యోగులకు బిగ్ కంపెనీల ఆదేశాలు!

అమెరికాలో హెచ్1బీ (H1b Visa) వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టెక్ కంపెనీల్లో టెన్షన్ పెంచింది. దీంతో తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు మెటా, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు తక్షణ చర్యలు చేపట్టాయి. ఈ కంపెనీలు తమ హెచ్1బీ (H1b Visa) వీసాదారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఉద్యోగులు కనీసం 14 రోజుల పాటు దేశం వదిలి వెళ్లొద్దని సూచించాయి. అలాగే యూఎస్ బయట ఉన్న వాళ్లు కూడా 24 గంటల్లో అమెరికా వచ్చేందుకు ప్రయత్నించాలని ఆదేశించాయి. కొత్త నిబంధనలపై స్పష్టత వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పాయట.
మైక్రోసాఫ్ట్ (Microsoft) అయితే తమ ఉద్యోగులకు మరింత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా బయట ఉన్న హెచ్1బీ (H1b Visa) ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికా వచ్చేయాలని స్పష్టంచేసింది. అలా రాని పక్షంలో దేశంలోకి రీఎంట్రీ కష్టమయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. కాగా, గతంలో మూడేళ్ల కాలపరిమితి ఉన్న హెచ్1బీ వీసాకు మూడేళ్లలో 2 వేల నుంచి 5 వేల ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఈ ఫీజును ట్రంప్ అమాంతం లక్ష డాలర్లకు పెంచడంతో ముఖ్యంగా భారతీయ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తం హెచ్1బీ (H1b Visa) వీసా హోల్డర్లలో 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.