జో బైడెన్ రూ.14,000 కోట్ల సాయం

విద్యుత్ వాహన తయారీ, అసెంబ్లింగ్ పున ప్రారంభించడం లేదా విస్తరించడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ ఆర్థిక సాయాన్ని తమ దేశీయ కంపెనీలకు ప్రకటించారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, జార్జియా వంటి 8 రాష్ట్రాలకు బైడెన్ ప్రభుత్వం 1.7 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.14,000 కోట్లు) సాయాన్ని ప్రకటించింది. వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి లేదా నిలుపుకోవడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంగా నడిపిస్తున్న వాహన ఆధారిత కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడానికి ఇంధన శాఖ 1.7 బి.డాలర్ల గ్రాంట్లను జారీ చేస్తుందని వైట్‌హౌస్ తెలిపింది.
ఒహాయో, ఇల్లినాయిస్, ఇండియానా, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాలు కూడా ఈ సాయం అందుకునే జాబితాలో ఉన్నాయి. విద్యుత్ మోటార్ సైకిల్లు, పాఠశాల బస్సులు, హైబ్రిడ్ పవర్ ట్రైయిన్‌లు, భారీ వాణిజ్య ట్రక్ బ్యాటరీలు, విద్యుత్ ఎస్‌యూవీల కోసం విడిభాగాలతో పాటు వాహన తయారీకి ఈ గ్రాంట్లు వర్తిస్తాయని వైట్‌హౌస్ తెలిపింది.