Washington: చైనాను చక్రబంధంలో ఇరికించేందుకు ట్రంప్ ప్రయత్నం…?

భారీ సుంకాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాను చావు దెబ్బకొట్టారా..? ఇప్పుడు ఆదేశం ముందు ఎలాంటి ప్రత్యామ్నాయాలున్నాయి. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు, వాణిజ్యం.. అమెరికాతో ట్రేడ్ వార్ వల్ల వచ్చిన నష్టాన్ని పూరిస్తాయా..? ఆ పరిస్థితి ఉంటుందా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకూ చైనా.. మిగిలిన దేశాలను పెద్దగా పట్టించుకోలేదు. అమెరికాతో శతృత్వం ఉన్నప్పటికీ.. వాణిజ్యరంగంలోకి దాన్ని తేలేదు. కానీ ట్రంప్ ఆపని చేశారు. తాను చైనాను శతృవుగా చూడనంటూనే.. భారీగా సుంకాలు విధించి, తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించారు.
అయితే అలా అని.. ట్రంప్ చైనా ఆర్థికవ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారా అంటే అదికూడా కాదు.. కేవలం తాను తమదేశానికి ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు .. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. భారీగా విధించిన సుంకాల తగ్గించుకోవాలంటే చైనాయే నేరుగా తమతో డీల్ మాట్లాడుకోవాలంటని ఆదేశ వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రావాల్సింది చైనానే అని, తమకు ఆ అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.
‘ఇప్పుడు బంతి చైనా కోర్టులోనే ఉంది. చైనానే మాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి. మాకు ఆ అవసరం లేదు. బీజింగ్‌కు, ఇతర దేశాలకు మధ్య తేడా లేదు. కాకపోతే ఆ దేశంపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి అంతే’ అని లీవిట్ పేర్కొన్నారు. తమ మార్కెట్ పైనే చైనా ఎక్కువగా ఆధారపడుతుందని ఆమె తెలిపారు. ఈసందర్భంగా చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సిద్ధంగా ఉన్నారని లీవిట్ వెల్లడించారు.
ట్రంప్ ఇటీవల పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించారు. ఈ ప్రకటన అనంతరం యూఎస్‌తో వాణిజ్యఒప్పందం కుదుర్చుకునేందుకు కొన్ని దేశాలు సిద్ధమయ్యాయి. దీంతో ప్రతిఘటించని దేశాలకు టారిఫ్‌ల నుంచి 90 రోజుల విరామం కల్పించారు. అయితే, చైనా (China) మాత్రం అందుకు విరుద్ధంగా అమెరికా వస్తువులపై సుంకాల శాతాన్ని పెంచుకుంటూ వచ్చింది. అలా చైనా వస్తువులపై ట్రంప్ 145 శాతం సుంకం విధించగా.. డ్రాగన్ కూడా అగ్రరాజ్యం వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. ఈక్రమంలోనే తమ దేశంలోని అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను యూఎస్‌కు ఎగుమతి చేయడాన్ని ఆపేస్తున్నట్లు డ్రాగన్ ప్రకటించింది.