America Team :ఆగస్టులో భారత్‌కు అమెరికా బృందం

ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా బృందం (America Team) ఆగస్టులో భారత్ (India)కు రానుంది. ఇప్పటికే ఐదు దశల్లో చర్చలు జరగ్గా, తదుపరి రౌండ్ చర్చల కోసం యుఎస్ అధికారులు రానున్నారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. గత వారం వాషింగ్టన్ (Washington)లో భారత్, అమెరికా బృందాలు ఐదో రౌండ్ చర్చలను ముగించాయి. భారత్ తరపున వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ (Rajesh Agarwal), అమెరికా తరపున అసిస్టెంట్ యుఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ బ్రెండన్ లించ్ (Brendan Lynch) చర్చల్లో పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేది నాటికే ఇరు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పలు అంశాలపై ఇరు దేశాలు పట్టుబట్టడంతో ఈ ఒప్పందం ఆలస్యం అవుతోంది. భారత్‌లో తమ జన్యు మార్పిడి (జిఎం) విత్తనాలు, పాడి పరిశ్రమలో పాలు, పాల ఉత్పత్తులను అనుమతించాలని అమెరికా తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు భారత్ వాహన, స్టీల్, ఆల్యూమినియం ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని పట్టుబడుతోంది.