భారత్ లో మత స్వేచ్ఛపై విచారిస్తాం : అమెరికా
భారత్‌లో మత స్వేచ్ఛపై ఈ నెల 20న విచారణ జరుపుతామని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా సంఘం (యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్.) ప్రకటించింది. మత స్వేచ్చ విషయంలో భారత్‌ను ఆందోళన చెందవలసిన దేశంగా వర్గీకరించాలని అమెరికా విదేశాంగ శాఖను 2020 సంవత్సరం నుంచే ఆ సంఘం కోరుతోంది. మత మార్పిళ్ల నిరోధం, గోవధ నిషేధం, మతంపై ఆధారపడి పౌరసత్వం ఇవ్వడానికి, స్వచ్చంద సంస్థలకు విదేశీ విరాళాలను అడ్డుకోవడానికి భారత్ చట్టాలు చేసిందని ఆ సంఘం విమర్శించింది.
హరియాణాలో మత ఘర్షణలు జరిగాయని, మణిపుర్లో క్రైస్తవ, యూదు మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అఘాయిత్యాలను అడ్డుకోవలసి ఉందని ఉద్ఘాటించింది. గత మే నెల 2వ తేదీన ఈ సంఘం భారత్‌లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించినా భారత ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. ఆ సంఘం నివేదిక పక్షపాతపూరితం, దురుద్దేశాలతో కూడుకున్నదని విమర్శించింది. 1998 నాటి చట్టం ద్వారా ఏర్పడిన స్వతంత్ర, ద్వైపాక్షిక సంఘమైన యు.ఎస్.సి.ఐ.ఆర్.ఎఫ్ దేశాధ్యక్షుడు, విదేశాంగ మంత్రి, పార్లమెంటు (కాంగ్రెస్)కు మత స్వేచ్ఛ ఉల్లంఘనలపై సిఫార్సులు చేస్తూ ఉంటుంది.






