Diplomats: దౌత్య సిబ్బందికి అమెరికా ఉద్వాసన!

ఈ ఏడాది ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) యంత్రాంగం ప్రకటించిన పరిపాలనా పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ 1,300 మంది ప్రభుత్వోద్యోగుల (Government employees)ను, దౌత్యవేత్తల (Diplomats)ను తొలగించనుంది. ఈ మేరకు 1,107 మంది ప్రభుత్వోద్యోగులకు, 246 మంది విదేశీ సర్వీసు ఉద్యోగులకు ( దౌత్య సిబ్బందికి) లే ఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడిరచారు. విదేశాంగ శాఖను మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి ఇది అవసరమని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే దౌత్య సిబ్బందిని తొలగించడం విదేశాల్లో అమెరికా పలుకుబడిని పలుచన చేయడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే విదేశాంగ సంబంధ ముప్పుల్ని సమర్థంగా తిప్పికొట్టే అవకాశం లేకుండా పోతుందని విమర్శకులు పేర్కొంటున్నారు. గడిచిన కొన్ని దశాబ్దాల అనంతరం చేపట్టిన అతిపెద్ద పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా నోటీసులు (Notices) జారీ చేస్తున్నట్లు త్వరలో కొందరు దౌత్య అధికారులకు తెలియజేస్తామని విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి మైకేల్ రిగాస్ (Michael Rigas) తెలిపారు.