భారత్ వ్యూహాత్మక భాగస్వామి : అమెరికా
ఉక్రెయిన్ వివాదంపై ఐక్యరాజ్యసమితి చార్టర్, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని రష్యాకు స్పష్టం చేయాలని అమెరికా భారతదేశానికి పిలుపునిచ్చింది. మోదీ-పుతిన్ చర్చలకు ముందు ఈ మేరకు ప్రకటన చేసింది. అదే సమయంలో భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్న అమెరికా, న్యూఢిల్లీలో తాము పూర్తి స్పష్టమైన సంభాషణలో పాల్గొంటామని వెల్లడించింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరుదేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నది పేర్కొంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు. భారత్ లేదా మరేదైనా ఇతర దేశాలు, రష్యాతో చర్చలకు నిమగ్నమైనప్పుడు, ఐక్యరాజ్యసమితి చార్టర్ను గౌరవించాలని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని మాస్కోకు స్పష్టం చేయాలన్నది మా అభిమతం అని మిల్లర్ తెలిపారు.






