Putin: శాంతి ప్రణాళిక తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు : పుతిన్ హెచ్చరిక
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ట్రంప్… శాంతి ప్రణాళిక సిద్ధం చేశారు.28 అంశాలతో కూడిన ఈ ప్రతిపాదనకు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. 2022 నుంచి కొనసాగుతున్న ఈ భీకర యుద్ధానికి ఒక తుది పరిష్కారం కనుగొనడానికి ఈ ప్రణాళికను ప్రాతిపదికగా తీసుకోవచ్చన్నారు పుతిన్. అమెరికా నుంచి తమకు ప్రతిపాదన అందిన విషయాన్ని ధ్రువీకరించారు. “తుది శాంతియుత పరిష్కారానికి దీనిని ఆధారంగా ఉపయోగించుకోవచ్చని నేను నమ్ముతున్నాను” అని పుతిన్ పేర్కొన్నారు. అలాస్కాలోని యాంకరేజ్‌లో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా వైపు నుంచి కొన్ని సర్దుబాట్లు, సౌలభ్యం చూపాలని కోరినట్లు పుతిన్ తెలిపారు. కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ రష్యా ఈ ప్రతిపాదనకు అంగీకరించిందని ఆయన వివరించారు.
అదే సమయంలో ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ హెచ్చరించారు. “ఒకవేళ కీవ్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే గతంలో కుపియాన్స్క్లో జరిగిన పరిణామాలే యుద్ధరంగంలోని ఇతర కీలక ప్రాంతాల్లోనూ పునరావృతం అవుతాయి. మొత్తం మీద ఈ పరిస్థితి మాకు ఆమోదయోగ్యమే” అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ శాంతి ప్రణాళిక రష్యా డిమాండ్లకు అనుకూలంగా ఉందని భావిస్తున్న ఉక్రెయిన్ తీవ్ర సందిగ్ధంలో పడింది. దీనిపై జెలెన్స్కీ మాట్లాడుతూ “ఇప్పుడు ఉక్రెయిన్ ముందు చాలా కఠినమైన ఎంపిక ఉంది. ఆత్మగౌరవాన్ని వదులుకోవడమా? లేక ఒక ప్రధాన భాగస్వామి (అమెరికా) మద్దతును కోల్పోవడమా? అనేది తేల్చుకోవాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నిజమైన, గౌరవప్రదమైన శాంతిని అందించే ప్రణాళిక కోసం తాము ఎదురుచూస్తున్నామని, ట్రంప్ బృందం ప్రయత్నాలను గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ శాంతి ప్రణాళికను అంగీకరించేందుకు ఉక్రెయిన్‌కు వచ్చే గురువారం వరకు ట్రంప్ గడువు విధించారు.






