Trump: ట్రంప్ అజెండాపై కాంగ్రెస్ లో వ్యతిరేకత…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. విదేశీ విధానం నుంచి దేశంలో పాలనాపద్దతులపైనా తనదైన మార్కు వేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆయన మరీ స్పీడ్ గా వెళ్తుండడం… చట్టసభ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ నిరూపించింది. ముఖ్యంగా మస్క్ నేతృత్వంలోని డోజ్‌పై, ఉక్రెయిన్ అంశంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిపై సెనెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు
అక్రమ వలసల నిరోధానికి, సైనిక అవసరాలకు రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన 340 బిలియన్ డాలర్ల బడ్జెట్ తీర్మానంపై సెనెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎట్టకేలకు తీర్మానం 52-48 ఓట్లతో నెగ్గినా, మున్ముందు సెనెట్, ప్రతినిధుల సభలలో ట్రంప్ ఎజెండా ముందుకు సాగడం అంత సులభం కాదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. గురువారం రాత్రంతా బడ్జెట్ తీర్మానంపై చర్చ జరిగింది. ‘‘ప్రజల జీవితాలను మరింత నాశనం చేయడానికి మమ్మల్ని ఇక్కడకు పంపలేదు. కానీ ట్రంప్, మస్క్ అదే చేస్తున్నారు’’ అని చర్చను ప్రారంభిస్తూ సెనెటర్ పాటీ ముర్రే పేర్కొన్నారు.
ఫెడరల్ ప్రభుత్వ సిబ్బందిని తగ్గించే ప్రయత్నంలో మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’(doge) చాలా కుటుంబాలను నాశనం చేస్తోందని మరో సెనెటర్ జెఫ్ మెర్కిలీ ఆరోపించారు. అటవీ సేవల్లో ఉన్న ఫెడరల్ సిబ్బందిని తొలగించడంపై సెనెటర్ మైకెల్ బెన్నెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ మేరకు సవరణ కూడా ప్రతిపాదించారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని సెనెటర్ జాక్ రీడ్, జీన్ షహీన్‌లు కోరారు. కానీ ఈ సవరణలు ఆమోదం పొందలేదు.
సుదీర్ఘంగా జరిగిన చర్చలో డెమోక్రాట్లు మొత్తం 33 సవరణలను ప్రతిపాదించారు. ఇవన్నీ వీగిపోయాయి. 340 బిలియన్ డాలర్లలో సింహభాగం సరిహద్దుల్లో వలసలకు అడ్డుకట్ట వేయడానికి, అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి వినియోగిస్తామని రిపబ్లికన్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు తీర్మానంపై ఓటింగ్ ముగిసింది. డెమోక్రాట్లతో కలిసి రిపబ్లికన్ సెనెటర్ రాండ్ పాల్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.