America: అమెరికాలో ప్రైవేటు కంపెనీ కీలక ప్రయోగం

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు కంపెనీ ఇంట్యూటివ్ మెషీన్స్ (Intuitive Machines) తాజాగా కీలక అంతరిక్ష ప్రయోగం చేపట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా అథీనా అనే ల్యాండర్‌ను ప్రయోగించింది. అందులో ఓ డ్రోన్ (Drone)ను పంపించింది. నాసా (NASA)కు చెందిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన అథీనా, మార్చి 6న జాబిల్లిపై దిగనుంది. ఈ ల్యాండర్ ఎత్తు 15 అడుగులు. చందమామ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్ అయ్యేలా దీనికి లక్ష్యాన్ని నిర్దేశించారు. జాబిలిపై సూర్య కిరణాలు ఎన్నడూ పడని జెట్ బ్లాక్ బిలానికి దాదాపు 400 మీటర్ల దూరంలోనే ఆ ప్రాంతం ఉంది. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అథీనా నుంచి గ్రేస్ అనే 3 అడుగుల డ్రోన్ బయటకు వచ్చి జాబిల్లిపై ఎగురుతుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దిగ్గజం గ్రేస్ హాపర్ సేవలకు గుర్తుగా ఈ డ్రోన్‌కు ఆయన పేరు పెట్టారు. జాబిల్లి ఉపరితలంపై గ్రేస్ మూడు కీలక పరీక్షలు నిర్వహించనుంది. దానిలో హైడ్రోజన్ (Hydrogen) ఇంధనంతో పనిచేసే థ్రస్టర్లను ఉపయోగించారు. నావిగేషన్ కోసం కెమేరా, లేజర్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ ఎగురుతుండగా దీనిలోని పరికరాలు జాబిల్లి ఉపరితలాన్ని అన్వేషిస్తాయి.