చైనా వర్సెస్ అమెరికా.. విమర్శలతో వేడెక్కిన శాంతి చర్చలు!
యాంకరేజ్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాం చివరి రోజుల్లో ఈ దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. దీనికి ప్రధాన కారణం కరోనానే. చైనాలో ఈ వైరస్ పుట్టడంతో ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత చైనా గురించి పెద్దగా మాట్లాడలేదు. తాజాగా చైనాతో రెండు రోజులపాటు శాంతి చర్చలు జరపాలని అమెరికా నిర్ణయించింది. అలస్కాలోని యాంకరేజ్‌లో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే చర్చలు ప్రారంభమైన మొదటి రోజే పరిస్థితి చేయిదాటిపోయినట్లు కనిపిస్తోంది. రెండు దేశాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతోనే సరిపోయింది. హాంగ్‌కాంగ్, టిబెట్, తైవాన్ దేశాలు, అలాగే ఉయిగర్ల విషయంలో చైనా వైఖరిని తప్పుబట్టిన అమెరికా బృందం మానవహక్కులను డ్రాగన్ కంట్రీ కాలరాస్తోందని విమర్శించారు. అయితే చాలామంది అమెరికన్లకే యూఎస్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్న చైనా బృందం.. అలాంటి ప్రజాస్వామ్య భావాలను బలవంతంగా తమపై రుద్దడానికి అమెరికా ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హాంగ్‌కాంగ్, తైవాన్, టిబెట్ గురించి మాట్లాడుతూ.. చైనా అంతర్గత విషయాల్లో తల దూర్చడం సరైన పద్ధతి కాదని తేల్చిచెప్పారు.
మా పీక నొక్కాలని చూస్తున్నారు: చైనా
ఈ చర్చల్లో అమెరికా బృందానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథనీ బ్లింకెన్ నేతృత్వం వహించారు. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరు అధికారులు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ విదేశీ వ్యవహారాల చీఫ్ యాంగ్ జీచి, చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీతో సమావేశం అయ్యారు. బైడన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు దేశాల అధికారులు ఇలా నేరుగా కలవడం ఇదే తొలిసారి. బైడెన్ కుమారుడు హంటర్.. చైనాలో వ్యాపారం చేస్తుండటంతో బైడెన్‌కు డ్రాగన్ దేశంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ సమావేశంలో అమెరికా తమ పీక నొక్కేయాలని చూస్తోందని చైనా అధికారులు కుండబద్దలు కొట్టారు. అయితే అలా చేయడం అమెరికా వల్ల కాదని స్పష్టం చేశారు. శాంతి చర్చల కోసం అమెరికా రమ్మంటే వచ్చామని, తాము రావడానికి ముందు రోజే తమ దేశంపై అమెరికా ఆంక్షలు విధించిందని చెప్పిన చైనా అధికారులు.. ఈ పద్ధతి అసలు బాగలేదని విమర్శించారు. ఈ నేతలు బహిరంగంగానే ఇలా విమర్శలకు దిగితే ఇక రహస్య మంతనాలు సజావుగా జరగడం కల్లేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చైనాలో అలాగే విదేశాల విషయంలో డ్రాగన్ దేశపు సామ్రాజ్యవాదాన్ని అణిచివేయడం కోసం బైడెన్ ప్రభుత్వం తమ మిత్రదేశాలతో కలిసి పనిచేస్తుందని బ్లింకెన్ స్పష్టంగా చెప్పేశారు. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మరో మెట్టుఎక్కి, చైనా ప్రాథమిక విలువలపై దాడికి దిగిందని, అందుకే యూఎస్ ఈ విషయాల్లో స్పందించాల్సి వస్తోందని వివరించారు. అయితే నిరాధారమైన ఆరోపణలను చైనా అంగీకరించబోదని, ఇటీవలి కాలంలో పరిణామాల కారణంగా రెండు దేశాల సంబంధాలు ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలిగించేలా తయారయ్యాయని యాంగ్ తెలిపారు.






