Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి బలం..పని చేయని ఎమ్మెల్యేలకు లోకేశ్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామానికి టీడీపీ (TDP) లోపలే బాటలు పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ పనులు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం చూపనట్లు గుర్తించిన కొంతమంది ఎమ్మెల్యేలు , ఇద్దరు మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆదేశించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (N. Chandrababu Naidu) కూడా ప్రజలకు సంబంధించిన కార్యాచరణలో అలసత్వం చూపుతున్న నేతలపై గట్టిగా ఫోకస్ చేస్తుండటంతో పార్టీ నాయకత్వం మరింత అప్రమత్తమైంది.
గతంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల (CMRF Cheques) పంపిణీలో నిర్లక్ష్యం చూపిన 48 మంది ఎమ్మెల్యేల వివరణను సీఎం కోరగా, ఇప్పుడు మరోసారి 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ (Praja Darbar) అనంతరం లోకేశ్ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశమై, నియోజకవర్గాల్లో సరిగా పనిచేయని నేతల జాబితాపై చర్చించారు. ఆ తరువాత ఈ 25 మంది నేతలకు నోటీసులు జారీ చేసి కార్యాచరణపై వివరాలు తెలియజేయాలని పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కు సూచించారు.
ఈ పరిణామం టీడీపీ అంతర్గత రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో తమదే అధికారం అన్న భావనతో ముందుకు సాగుతూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కొంతమంది ఎమ్మెల్యేల తీరు అధినేతలకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలు సాధించాలంటే కార్యకర్తలు బలంగా నిలబడాలని, వారి సమస్యలు పరిష్కరించడం పార్టీ బాధ్యత అని లోకేశ్ పదేపదే స్పష్టం చేస్తున్నారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అటువంటి 600 మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా రాకపోగా, 75 మందికి చెక్కులు ఇంకా ఇవ్వకపోవడం పెద్ద నిర్లక్ష్యంగా భావించారు. ఈ ఆలస్యానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే కారణమని తెలిసిన వెంటనే లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కార్యకర్తలే పార్టీకి బలం, వారి త్యాగంతోనే నాయకులు విజయం సాధిస్తారు’ అంటూ ఎమ్మెల్యేలకు ఆయన పంపిన సందేశం ఇప్పుడు పార్టీ అంతటా మార్మోగుతోంది.
ఈ పరిస్థితుల వల్ల నోటీసులు అందుకున్న నేతలు ఇప్పుడు భారీ ఒత్తిడిలో ఉన్నారు. మౌఖికంగా వివరణ ఇచ్చినా, లిఖితపూర్వక వివరణ తప్పనిసరిగా ఇవ్వాలని పార్టీ స్పష్టం చేసింది. ఇక కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో టీడీపీ లోపల క్రమశిక్షణ బిగుసుకుంటున్నదనే భావన స్పష్టమవుతోంది. పార్టీ కార్యకర్తలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం సంకేతాలు పంపుతున్న ఈ దశలో, నోటీసులు పొందిన నేతల భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.






