Donald Trump: భారతీయులపై ట్రంప్ కఠిన వైఖరి, 7 నెలల్లో ఎంతమందిని బహిష్కరించారంటే..?

ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులకు అమెరికా(United States) కలల దేశం. అమెరికాలో ఉన్నత జీవితాన్ని నిర్మించుకోవాలని, అక్కడే స్థిరపడిపోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు మన దేశ యువత. అక్కడికి వెళ్తే చాలు, ఏదోక అవకాశం దొరుకుతుందనే ఆశతో కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం అనేది కష్టమే. అక్కడ అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ బ్రతకడం కూడా కష్టమే. కాని డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ఓ నరక కూపంగా మారుతోందనే ఆవేదన చాలా మందిలో వినపడింది.
విదేశీయుల విషయంలో ఆ దేశాధ్యక్షుడి వైఖరి ఎంత కఠినంగా ఉందో తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ విడుదల చేసిన లెక్కలు చెప్తున్నాయి. వేలాది మంది భారతీయులను ఆ దేశం బహిష్కరించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. గతంలో పార్లమెంట్ లో మన విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. 2017 నుండి 2021 వరకు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ దేశం మొత్తం 6,135 మంది భారతీయులను బహిష్కరించింది. 2019లో అత్యధికంగా 2,042 మందిని బహిష్కరించింది అమెరికా.
2017లో 1,024 మంది దేశ బహిష్కరణకు గురి కాగా.. 2018లో 1,180 మందిని దేశం నుంచి పంపించారు. ఇక 2020లో 1,889 మంది తిరిగి మన దేశానికి వచ్చారు. ఇక రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా.. ట్రంప్ వైఖరిలో మార్పు రాలేదు. గత ఏడు నెలల కాలంలో.. అంటే జనవరి 20 నుంచి నిన్నటి వరకు మొత్తం 1,563 మంది భారతీయ పౌరులు అమెరికా నుండి బహిష్కరణకు గురయ్యారట. ఈ లెక్కలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బయటపెట్టారు. ఇక మరో 18,000 వేల మందిని అమెరికా బహిష్కరించే అవకాశాలు ఉన్నాయట.