US Elections : స్థానిక ఎన్నికల్లో ఓటమికి ట్రంప్ సిల్లీ రీజన్స్..
అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు.. అప్పుడే ట్రంప్ టీమ్ కు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలపై ఎగసిపడుతున్న ప్రజాగ్రహం.. బ్యాలెట్ రూపంలో వారికి ఓటమి రుచి చూపించింది. అందులోనూ తాను తీవ్రంగా వ్యతిరేకించిన జోహ్రాన్ మమ్దానీ.. న్యూయార్క్ మేయర్ గా ఎన్నిక కావడం ట్రంప్ కు అస్సలు రుచించడం లేదు. దీనికి తోడు కీలక రాష్ట్రాల్లో డెమొక్రాట్ల విజయపరంపర కొనసాగడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓటమికి ట్రంప్ చాలా సిల్లీరీజన్ చెప్పారు. బ్యాలెట్ లో తనపేరు లేకపోవడంతోనే ఓడిపోయామంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.
ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి కారణాలను విశ్లేషిస్తూ ఒక పోల్స్టర్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ఖాతాలో పంచుకున్నారు. “బ్యాలెట్లో నా పేరు లేకపోవడం, నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఫెడరల్ షట్డౌన్ కారణంగా రిపబ్లికన్లకు ఓటమి తప్పలేదని అర్థం వచ్చేలా ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకంగా రావడంతో.. ట్రంప్ కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “రాజ్యాంగ విరుద్ధమైన రీమ్యాపింగ్ పేరుతో కాలిఫోర్నియాలో భారీ స్కామ్ జరిగింది. అంతేకాకుండా ఓటింగ్ ప్రక్రియలోనూ రిగ్గింగ్ చోటుచేసుకుంది. మెయిల్-ఇన్ ఓట్లను పక్కన పెట్టేశారు. ఇది చాలా తీవ్రమైన అంశం” అని ట్రంప్ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో కూడా ట్రంప్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేయడం గమనార్హం
మరోవైపు న్యూజెర్సీ రాష్ట్రంలోనూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మైకీ షెరిల్ గవర్నర్గా గెలిచారు. 1960ల తర్వాత వరుసగా మూడు సార్లు న్యూజెర్సీ గవర్నర్ పదవిని డెమోక్రాట్లు దక్కించుకోవడం ఇది మొదటిసారి. అలాగే వర్జీనియాలోనూ డెమోక్రాట్ నేత ఆబిగేల్ స్పాన్బర్గర్ విజయం సాధించారు. ఈ ఫలితాలు రాబోయే జాతీయ ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. స్థానిక సమస్యలు, ఆర్థికపరమైన ఆందోళనలు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై డెమోక్రాట్లు దృష్టి సారించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.







