Donald Trump:కెనడాపై ట్రంప్ ఆగ్రహం .. వాణిజ్య చర్చలు ఆపేసిన యూఎస్!
కెనడా ప్రభుత్వం ‘చీటింగ్’ చేస్తూ దొరికిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ప్రభుత్వం విధించిన సుంకాలపై (US Tariffs) యూఎస్ సుప్రీంకోర్టు నవంబర్ 5న తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. ఆ తీర్పును అక్రమంగా ప్రభావితం చేసేందుకు కెనడా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇటీవల ఒంటారియో ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో సుంకాలపై యూఎస్ మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ (Ronald Reagan) చేసిన వ్యాఖ్యలను ఉపయోగించారు. దిగుమతులపై సుంకాలు వేయడం దేశభక్తితో చేసే పని అని అనుకుంటారని, కానీ దీర్ఘకాలంలో ఈ సుంకాలు అమెరికన్ కార్మికులు, వినియోగదారులకే భారంగా మారతాయని రీగన్ చెప్పిన మాటలను ఈ యాడ్‌లో చూపించారు.
దీనిపై ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. కెనడా ‘తప్పుడు యాడ్’ వేసిందని, దేశభద్రత కోసం విధించే సుంకాలను రీగన్ ఎప్పుడూ ప్రోత్సహించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేయడానికే ఈ ప్రకటన వేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కెనడాతో వాణిజ్య చర్చలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఒంటారియో ప్రభుత్వం తమ అనుమతి లేకుండా, రీగన్ మాటలను వక్రీకరించి యాడ్ వేసిందని ‘ది రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ ఫౌండేషన్’ విమర్శించింది. అయితే ఈ వివాదంపై స్పందించిన ఒంటారియో ప్రీమియర్ డాగ్ ఫోర్డ్.. ట్రంప్ (Donald Trump) ఈ యాడ్ చూసినట్లు తనకు తెలిసిందని, ఆయనకు ఇది నచ్చి ఉండకపోవచ్చని ఎద్దేవా చేశారు.







