24న అధికారుల ముందు హాజరవుతా : ట్రంప్
గత అధ్యక్ష ఎన్నికల సందర్భంగా (2020లో) జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకున్న కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల ముందు ఈ నెల 24న లొంగిపోతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జార్జియాలో ట్రంప్ ఓడిపోయినప్పటికీ విజయం సాధించినట్లు చూపేందుకు ప్రయత్నించారన్నది ఆయనపై అభియోగం. ఈ ఏడాది ట్రంప్‌పై దాఖలైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్ పొందారు. ఇప్పటికే ట్రంప్ స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. ట్రంప్ పై 13 ఆరోపణలున్నాయి. ట్రంప్ మాత్రం ఈ ఆరోపణలు మొత్తం అవాస్తవాలని అంటున్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే వీటిని చేపటినట్టు ఆరోపిస్తున్నారు.






