Doze : డోజ్ ఓ రాకాసి.. మస్క్‌ను తినేస్తుంది: ట్రంప్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోమారు బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. మస్క్ ఇంతకాలం సేవలందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(డోజ్)ను ఆయనపైనే ప్రయోగిస్తామని ట్రంప్ తన ఫ్లోరిడా (Florida ) పర్యటనలో హెచ్చరించారు. ప్రపంచంలో ఎవరికీ దక్కనన్ని సబ్సిడీలు మస్క్‌కు అందుతున్నాయి. ఈ సబ్సిడీలు లేకపోతే, ఆయన దుకాణం మూసుకుని, వెళ్లిపోవాల్సిందే అని ఇటీవల వ్యాఖ్యానించారు ట్రంప్. తాజాగా డోజ్ (Doze ) అనే రాకాసి ఇప్పుడు మస్క్‌ను తినేసేలా చేస్తామని పేర్కొన్నారు. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్లు, విద్యుత్తు కార్ల ఉత్పత్తి విషయంలో ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నాం.ఈ సబ్సిడీలను ఆపేస్తే, దేశానికి ఎంతో మిగులుతుంది. దీనిపై చర్యలకు డోజ్ సిద్ధంగా ఉంది. డోజ్ మస్క్ వైపు చూస్తే మనం చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. మస్క్‌పై డోజ్‌ను ప్రయోగించాల్సి రావొచ్చు. డోజ్ అంటే ఏంటో తెలుసా? ఓ రాకాసి. ఎంతో భయంకరమైనది. మస్క్‌ను తినేస్తుంది అని అన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big Beautiful Bill ) ను మస్క్ వ్యతిరేకించినప్పటి నుంచి ట్రంప్‌తో విభేదాలు పెరిగిన విషయం తెలిసిందే.