White House: మీతో కలిసి పనిచేసిన ఆ క్షణాలు అద్భుతం.. మస్క్ పై ట్రంప్ ప్రశంసలు..

పాత మిత్రుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను ట్రంప్ మర్చిపోలేకపోతున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నప్పటికీ.. మస్క్ (Musk) అద్భుతమైన వ్యక్తి అంటూ ట్రంప్ (Trump) ప్రశంసించారు. ఈ మధ్య మస్క్‌తో పెద్దగా మాట్లాడలేదని కానీ మస్క్ తెలివైన వ్యక్తి అని కితాబిచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాల్లో ఆయన బాగా పని చేశాడని అన్నారు. మస్క్‌తో విభేదాలకు కారణమేమిటని మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ఎలక్ట్రిక్ వాహన పన్ను క్రెడిట్ రద్దు గురించి టెస్లా అధినేత కొంతమేర కలత చెందారని పేర్కొన్నారు. అది అతడికి కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ.. ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలని తాను కోరుకోనని అన్నారు.
ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును గతంలో మస్క్ వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందుతున్నట్లు మస్క్ పోస్టు పెట్టడంతో వివాదం ముగిసింది. ఆదివారం మస్క్ మరోసారి ఈ బిల్లుపై మాట్లాడుతూ.. తీవ్ర విమర్శలు చేశారు. ఈ తాజా బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో పేర్కొన్నారు. దేశానికి అపారమైన హాని కలిగిస్తుందన్నారు. ఇది ఒక విధ్వంసకర చర్య అని వ్యాఖ్యానించారు.
మస్క్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ.. పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే ఈ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. ఇక సెనెట్‌లో బిల్లుకు ఆమోదం లభించడంపై ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. ఇది తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, వృథా ఖర్చులను తగ్గించడానికి, సరిహద్దు భద్రతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు.