Donald Trump : ఆ దేశానికి ఈ నిధులు అవసరం లేదు : ట్రంప్

భారత్‌లో ఓటింగ్‌ను పెంచేందుకు బైడెన్ హయాంలో అమెరికా చేసిన సాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఐదోసారి ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ (India) కు రూ.182 కోట్లు కేటాయించిన అంశాన్ని గుర్తు చేశారు. ఆ దేశానికి ఈ నిధులు అవసరం లేదని, వాషింగ్టన్ (Washington)లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ( సీపీఏసీ) ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమెరికా సాయాన్ని భారత్ అవకాశంగా తీసుకుంటోందని ఆరోపించారు.
భారత్ ఎన్నికల కోసం రూ.182 కోట్లు సాయం చేశాం. ఇదేం దారుణం? ఒటర్ ఐడీ (Otter ID )వంటి వాటిలో మనకే వారు సాయం చేయొచ్చు కదా. అది మంచిది కాదా. మన భారత్‌లో ఎన్నికలకు డబ్బులిస్తున్నాం. వారికి అవి అవసరం లేదు. వారు మనల్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అది ఒకటి. మనపై 200 శాతం సుంకాలు విధిస్తున్నారు. వారికి మనం భారీగా డబ్బులు ఇస్తున్నాం. వారి ఎన్నికలకు సాయం చేస్తున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.