అమెరికా కోర్టు సంచలన తీర్పు
ఓ రివెంజ్ పోర్న్ కేసులో అమెరికాలోని టెక్సాస్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత మహిళకు పరిహారం కింద 1.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.10 వేల కోట్లు) చెల్లించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తమ మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై 2022లో వేధింపుల కేసు వేసింది. బ్రేకప్ తర్వాత అతను తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. 2016 నుంచి డేటింగ్లో ఉన్న వారి మధ్య 2021లో బ్రేకప్ అయింది. దీని తర్వాత అతను ప్రతీకారంగా తనకు చెందిన వ్యక్తిగత, సన్నిహితంగా మెలిగే ఫొటోలను సోషల్ మీడియా మాధ్యమాలతో పాటు అడల్ట్ వెబ్సైట్ లలో పోస్టు చేశాడని బాధిత మహిళ ఆరోపించారు. ఆ లింకులను తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపేవాడని పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం మానసిక వేధింపులకు 20 కోట్ల డాలర్లు, నష్టపరిహారం కింద 100 కోట్ల డాలర్లు చెల్లించాలని మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను ఆదేశించింది. వాస్తవానికి బాధితురాలి తరపు న్యాయవాదులు 10 కోట్ల డాలర్ల పరిహారం ఇప్పించాలని కోరారు.






