రెండవసారి అభిశంసనకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడితో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారని ద్వైపాక్షిక పద్ధతిలో సభ నిరూపించింది.
నాన్సీ పెలోసి, స్పీకర్
రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు చరిత్రకెక్కారు. ప్రతినిధుల మహాసభలో ద్వైపాక్షిక మద్దతుతో ఇది నిర్ధారణ అయింది.
ట్రంప్‌ను అభిశంసించడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల మహాసభ 232-197 ఓట్లతో ఆమోదించింది. 10 మంది రిపబ్లికన్లు కూడా అభిశంసనను సమర్థిస్తూ ఓటు వేశారు. జో బైడెన్ విజయాన్ని నిర్ధారించేందుకు గత జనవరి 6న కాంగ్రెస్ ఉభయ సభల సమావేశం జరగకుండా అడ్డుకునేందుకు అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు ముట్టడించడంపై ఆయనను అభిశంసించడానికి ప్రతినిధుల మహాసభ సమావేశమైంది. మహాసభలో డెమోక్రాట్లు, 10 మంది రిపబ్లికన్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది.
”చట్టానికి అమెరికా అధ్యక్షుడుతో సహా ఎవరూ అతీతులు కారని ఈ రోజు ద్వైపాక్షిక పద్ధతిలో సభ నిరూపించింది. డొనాల్డ్ ట్రంప్ దేశానికి అపాయకరమైన వ్యక్తి అనే సంగతి స్పష్టంగా తేలిపోయింది” అని స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆమె తీర్మానంపై సంతకం చేయడంతో ట్రంప్‌పై రెండవ అభిశంసన తీర్మానం అధికారికం అయింది.
”నేను సరిగ్గానే ఓటు వేశాను. ఈ రోజు నాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. చరిత్ర అదే విధమైన తీర్పు ఇస్తుందనే అనుకున్నాను” అని ప్రముఖ ట్రంప్ విమర్శకుడు, రిపబ్లికన్ సభ్యుడు అయిన ఆడమ్ కిన్జింగర్ వ్యాఖ్యానించారు.
ప్రతినిధుల మహాసభ ఈ తీర్మానాన్ని విచారణ నిమిత్తం సెనేట్‌కు పంపిస్తుంది. విచారణ తర్వాత సెనేట్ ఆయనకు శిక్ష విధించవచ్చు లేదా వదిలేయవచ్చు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందనడానికి ప్రత్యేకంగా గడువంటూ ఏమీ లేదు.






