మేం అధికారంలోకి వస్తే.. భారత్ తో మైత్రి : నిక్కీ హేలీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే నాటోతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేస్తామని భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే నాటో కూటమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటో కూటమికి రష్యా, చైనా వంటి దేశాలు భయపడుతున్నాయని, దాన్ని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. కూటమితో పాటు మరికొన్ని దేశాలతో బంధం మరింత దృఢంగా ఉండేలా చూసుకోవాలని అప్పుడే శత్రుదేశాలు హద్దుల్లో ఉంటాయని అభిప్రాయపడ్డారు.






