మెలానియా ట్రంప్ అలా చేస్తే బాగుండేది…
అమెరికా ప్రథమ మహిళగా ఉండే చివరి రోజుల్లో మెలానియా ట్రంప్ చాలావరకు శ్వేతసౌధానికి దూరంగానే ఉంటున్నారు. తన భర్త, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం త్వరలో ముగియటం ఆమెకు అంత విచారకరంగా ఉన్నట్లు కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు. పైగా తన కుమారుడు బారన్‌కు ఫ్లోరిడాలో ఓ మంచి స్కూలును వెతికే పనిలో ఆమె బిజీగా ఉన్నారట. గత 152 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లుగా..కాబోయే అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత ప్రథమ మహిళగా హాజరయేందుకు కూడా నిజానికి ఆమెకేమీ అభ్యంతరం ఉండకపోవచ్చని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా మెలానియా ట్రంప్ తన వీడ్కోలు సందేశంలో కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ను స్వాగతించక పోయినా.. కనీసం అభినందనలు తెలియచేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.






