US: అందాల నగరంలో అగ్నికీలలు.. లాస్ ఏంజెలెస్ లో నిరసనకారులు వర్సెస్ పోలీసులు..

అమెరికా అందాల నగరం లాస్ ఏంజెలెస్ (Los Angeles) నిరసనాగ్నితో రగులుతోంది.ముఖ్యంగా వలసదారుల ఆందోళనలు.. దాడులతో రణరంగంలా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్‌టౌన్‌లో ఎవరూ గుమికూడ వద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు నేషనల్ గార్డ్స్ ను అమెరికా రంగంలోకి దింపింది. అంతేకాదు..లాస్ ఏంజెలెస్‌లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనల్లో మాస్క్‌ల వినియోగాన్ని ఆయన నిషేధించారు.
ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2,000 మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్‌లోని ప్రధాన హైవేను తమ అధీనంలోకి తీసుకొన్నారు. ఇక్కడ సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు వారు నిప్పు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో 101 ఫ్రీవేను ఆందోళనకారులు అడ్డుకొన్నారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని మూసేశారు. ఆందోళనకారులు పోలీసులపై రకరకాల వస్తువులు విసిరి దాడికి యత్నించారు. చాలా పోలీసు వాహనాలు తగలపెట్టారు. పసిఫిక్ సముద్రం పక్క నుంచి ఈ మార్గం దాదాపు 1500 మైళ్లు ప్రయాణిస్తుంది.
ట్రంప్ చర్యలకు మస్క్(Musk) మద్దతు..!
గత కొన్నాళ్లుగా ట్రంప్‌నకు బద్ధవిరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్.. తాజాగా లాస్ ఏంజెలెస్ నేషనల్ గార్డ్‌లను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టాడు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజెలెస్ మేయర్‌లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టు స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. దీంతోపాటు జేడీ వాన్స్ పోస్టులను కూడా రీపోస్టు చేశాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లాస్ ఏంజెలెస్ స్థానిక నాయకత్వం మధ్య ఘర్షణ కూడా పెరుగుతోంది. తాజాగా ఆ నగర మేయర్ కరెన్ బాస్ మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళనలు జరగాలన్నారు. ఇక ట్రంప్ వ్యవహార శైలిని తప్పపట్టారు. ‘‘లాస్ ఏజెంలెస్‌లోని పరిస్థితిని రెచ్చగొట్టింది పాలకవర్గమే. పని ప్రాంగణాలు వంటి వాటిపై దాడులు నిర్వహించి తల్లిదండ్రులు, పిల్లలను వేధిస్తే.. సాయుధ బలగాలతో వీధుల్లో కవాతు చేయించి.. మీరు ప్రజల్లో భయం, ఆందోళన సృష్టిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
ఈ నగరంలో ఆందోళనలను అణిచివేయాలని 2,000 మంది నేషనల్ గార్డ్స్‌ను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసింది. ఇప్పటికే 300 మంది ఆ నగరానికి చేరుకొన్నారు. ‘‘ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజెలెస్‌ను అక్రమ వలసదారులు క్రిమినల్స్ ఆక్రమించుకొన్నారు’’ అని సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.