TTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణిలో (Parakamani) జరిగిన భారీ దొంగతనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. శ్రీవారి హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని దొంగలించి కోట్లు సంపాదించిన టీటీడీ ఉద్యోగుడు రవికుమార్ (Ravi Kumar) చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. దొంగతనాలతో కోట్లు సంపాదించిన రవికుమార్ తో వైసీపీ (YCP) హయాంలో టీటీడీ రాజీ కుదుర్చుకోవడం వివాదానికి కారణమైంది. దొంగతో లోక్ అదాలత్ లో ఎలా రాజీ కుదుర్చుకుంటారంటూ హైకోర్టు ప్రశ్నించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని మంత్ర నారా లోకేశ్ ప్రకటించారు.
2023 ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పరకామణి కాంప్లెక్స్ లో సి.వి.రవికుమార్‌ను (CV Ravi Kumar) రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. పరకామణీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన విదేశీ కరెన్సీని తన లోదుస్తుల్లో దాచుకున్నట్టు కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో ఆయన్ను విజెలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇలా ఆయన పలుమార్లు దొంగతానాలకు పాల్పడినట్లు తర్వాత తేలింది. ఆయన టీటీడీలో గ్రూప్-2 స్థాయి ఉద్యోగి. ఆయన సంపద వందకోట్లకు పైగు ఉంటుందని ఆ తర్వాత విచారణలో తేలింది. హుండీ సొమ్ము దొంగలించడం ద్వారానే ఆయన పెద్దఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నారని తేలింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారాన్ని అప్పటి టీటీడీ పాలకమండలి ఆగమేఘాలపై ముగించింది. రవికుమార్ ను అరెస్టు చేయలేదు. కేవలం 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ పూర్తి చేశారు. ఆ తర్వాత లోక్ అదాలత్ లో అతనితో రాజీ కుదుర్చుకున్నారు. ఇందుకుగానీ తన ఆస్తిలో కొంత భాగాన్ని టీటీడీకి రవికుమార్ బదలాయించారు. దీంతో ఆయనపై కేసు క్లోజ్ చేశారు. అయితే ఈ అంశంపై అప్పట్లోనే టీటీడీ తీరును తప్పుబడుతూ హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దొంగతో లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఈ కేసుకు సంబంధించి పలు సంచలన అంశాలు వెల్లడించారు. రవికుమార్ తో రాజీ కుదుర్చుకోవడం వెనుక నాటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), ఈవో, పలువురు టీటీడీ ఉద్యోగులు భారీగా లబ్దిపొందినట్లు ఆయన ఆరోపించారు. రవికుమార్ ఆస్తులను వీళ్లు తమ బినామీలతో రాయించుకున్నారని, రవికుమార్ ప్రాణాలకు ముప్పు ఉందని భానుప్రకాశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయితే కోట్ల విలువైన భూములను తాము రవికుమార్ నుంచి టీటీడీకి అప్పగించినట్లు భూమన వెల్లడించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎస్సై స్థాయి ఉద్యోగి చాలని, సీబీఐ అక్కర్లేదని భాను ప్రకాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో మరిన్ని సంచలన విషయాలు బయటికొస్తాయన్నారు.
పరకామణి దొంగతనం వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు. దీని వెనుక సమగ్ర దర్యాప్తు అవసరం ఉందన్నారు. అందుకే త్వరలోనే సిట్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రవికుమార్ నుంచి నాటి వైసీపీ నేతలు భారీగా లబ్దిపొందాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్ దర్యాప్తు మరిన్ని అంశాలు వెలుగులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.