సైనిక కుటుంబాలకు పెద్ద దిక్కు..అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సంక్షేమ పథకాలు
వాషింగ్టన్ః ప్రస్తుత సైనికులు, మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ప్రకటించారు. సాయుధ దళాలకు చెందిన ప్రతి ఒక్క కుటుంబానికీ ఏదో ఒక సేవను అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు ఆమె ఒక కార్యక్రమంలో వెల్లడించారు. సైనికుడి కుటుంబాన్ని మరమ్మతు చేయడానికైనా తాము సిద్ధమని ఆమె తెలిపారు.
సైనిక కుటుంబాల సంక్షేమానికి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఒక విధంగా ఇది కూడా దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశమేనని ఆమె పేర్కొన్నారు. సైనిక కుటుంబాల శారీరక, సామాజిక, ఆరోగ్య సంక్షేమం మీద సైనికుల ప్రతిభా పాటవాలు ఆధారపడి ఉంటాయని ఆమె అన్నారు.
‘‘సైనికుల కుటుంబాలను పట్టించుకోకపోతే, వారు సమర్థంగా ఎలా పనిచేయగలుగుతారు” అని ఆమె అన్నారు. సైన్యంలో కొత్తవారు చేరాలన్నా, సైనిక విద్యాసంస్థల్లో విద్యార్థులు శిక్షణ పొందాలన్నా, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె తెలిపారు. సైనిక కుటుంబాలలో ఎంత లేదన్నా ఇరవై లక్షల మంది పిల్లలుంటారని, వారికి సరైన చదువు, వైద్య సౌకర్యాలు, క్రీడా సౌకర్యాలు, వసతి సౌకర్యాలు కల్పించడానికి తమ బైడెన్ ఫౌండేషన్ అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని, వారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఆమె వివరించారు.
సైనిక కుటుంబాలలో చదువుకున్నవారి సంఖ్య, ఉద్యోగాలు చేస్తున్నవారి సంఖ్య 22 శాతాన్ని మించి లేదని, ఇందులో అనేక కుటుంబాలు నిరుద్యోగంతో పాటు పేదరికాన్ని కూడా అనుభవించాల్సి వస్తోందని జిల్ బైడెన్ తెలిపారు. ‘‘ఇక నుంచి నేనే సైనిక కుటుంబాలకు తల్లిని, సోదరిని, కుమార్తెను. వారి అన్ని విధాలా ఆదుకుంటా” అని ఆమె అభయమిచ్చారు. ‘‘దేశమా, కుటుంబమా అనే ఆలోచన సైనికులకు కలగకూడదు. వారు దేశ భద్రత చూసుకుంటున్నప్పుడు నేను వారి కుటుంబాల సంక్షేమం చూసుకుంటా. కుటుంబం విషయంలో సైనికులు కనే కలలను మేం సాకారం చేస్తాం” అని ఆమె స్పష్టం చేశారు.
భారీగా ప్రభుత్వ సహకారం
తమ ఫౌండేషన్ కార్యకలాపాలకు చేదోడు వాదోడుగా ఉండడానికి రక్షణ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ ముందుకు వచ్చాయని, తమ కార్యకలాపాలు అతి త్వరలో ఊపందుకోబోతున్నాయని జిల్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖలు అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నాయని, అనేక ప్రైవేట్ సంస్థలు కూడా తమకు అండగా నిలవబోతున్నాయని ఆమె తెలిపారు.
సైనిక కుటుంబాలు, న్యాయ నిపుణులు, సామాజిక సేవా రంగాల వారు, పలువురు అధికారులు హాజరైన ఈ వీడియో సమావేశానికి ప్రత్యక్షంగా వంద మంది అధికారులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం వైట్‌హౌస్‌లో జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత ఆమె ‘వన్‌సోర్స్’ అనే కాల్ సెంటర్‌ను సందర్శించారు. ఇది రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. సైనిక కుటుంబాలకు మాత్రమే పరిమితమైన ఈ కాల్ సెంటర్ వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలు సలహాలు, సూచనలు అందిస్తుంటుంది. దేశంలో మూడు ప్రాంతాలలో ఈ వన్‌సోర్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
జో బైడెన్ దేశాధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె సుమారు వారం రోజుల పాటు ఈ సైనిక కుటుంబాల మధ్యే గడిపారు. వారి కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్నారు. ఆమె సైనికులు, సైనికాధికారుల కుటుంబాలతో పాటు, రక్షణ శాఖ సిబ్బంది కుటుంబాలను కూడా కలుసుకున్నారు. అంతే కాదు, రక్షణ శాఖ సిబ్బంది కుటుంబాలను కూడా తమ సంక్షేమ కార్యక్రమాల్లో చేర్చారు.
విద్యార్థులు, పౌరులు పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరేలా చర్యలు తీసుకుంటామని ఆమె ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. అధ్యక్షుడుగా జో బైడెన్ అధికారం చేపట్టిన కొద్ది రోజులకు ఆమె తన సంస్థకు సి.ఇ.ఓగా రోరీ బ్రోసియస్ను నియమించారు. ఇంతకు ముందు బ్రోసియస్ ఈ సంస్థలోనే డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా, 69 ఏళ్ల జిల్ బైడెన్ గతంలో ఒబామా సతీమణి మిషెల్ ఒబామాతో కలిసి ప్రజా సేవా కార్యక్రమాల్లో పనిచేశారు. 2017 నుంచి బైడెన్ ఫౌండేషన్ ద్వారా సైనిక కుటుంబాలకు సేవలందిస్తున్నారు.






