ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర
అమెరికా అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయంగానే కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనవాళ్లు అనేకమంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పాటుపడుతున్నారు. విచిత్రమేమిటంటే, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తున్నట్టు తాజగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 5 లక్షల మందికిపైగా భారతీయులు అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని, వారి మొత్తం కొనుగోలు శక్తి 15.5 బిలియన్ డాలర్లని (రూ.1.13 లక్షల కోట్లు) ఆ దేశానికి చెందిన మేధో సంస్థ న్యూ అమెరికా ఎకానమీ అంచనా వేసింది. అలాగే ఆ దేశ ఆర్థిక వ్వవస్థకు వీరు ఏటా 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) సమకూరుస్తున్నారని వెల్లడించింది.
2019 ఏడాదికి సంబంధించి అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టింది. ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వలస ప్రజల్లో అత్యధిక మొత్తంలో దేశ ఆర్థిక వ్యవస్థకు సాయపడుతున్న వారిలో భారతీయులు టాప్-3లో ఉన్నట్టు వివరించింది. అమెరికాలో దాదాపు 42 లక్షల మంది మెక్సికన్లు అక్రమంగా నివసిస్తున్నారు. మొత్తంగా అగ్రరాజ్యంలో 1.03 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా, వారిలో మెక్సికన్ల వాటానే 40.8 శాతం కావడం గమనార్హం. మెక్సికన్ల కొనుగోలు శక్తి 82.2 బిలియన్ డాలర్లని వెల్లడించింది.






