America : అమెరికాలో ఎంబసీ పేరుతో వచ్చే కాల్స్‌తో జాగ్రత్త

అమెరికాలోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం పేరుతో నకిలీ కాల్స్ వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ (Indian Embassy ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డు(Credit card) వివరాలు వెల్లడిరచవద్దని కోరింది. పాస్‌పోర్టు (Passport), ఇమిగ్రేషన్ ఫారమ్, వీసాలో తప్పులు ఉన్నాయని చెబుతూ సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ లోపాలను సవరించే పేరుతో డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడిరచింది. లోపాలను సరిదిద్దుకోకపోతే ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న నిబంధనల ప్రకారం తిరిగి భారత్ (India)కు వెళ్లాల్సి ఉంటుందని, లేదా జైలుశిక్ష తప్పదని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఇటువంటి కాల్స్ వస్తే భయపడకుండా తమకు సమాచారం అందించాలని సూచించింది. రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులెవరూ ప్రజల వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్‌కాల్స్ చేయరని, అధికారిక ఈ మెయిల్ (Email) ద్వారానే సంప్రదిస్తారని తెలిపారు.