2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల రికార్డు స్థాయి ఓటింగ్!
గతేడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు రికార్డు సృష్టించారు. ఈ ఎలక్షన్లలో దేశంలోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో 71శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) బ్లాగు పోస్టులో పరిశోధకులు వెల్లడించారు. రెండో స్థానంలో జపనీస్ అమెరికన్లు ఉన్నారట. వీరిలో 66శాతం ఓటింగ్లో పాల్గొన్నారు. అంతకుముందు 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలతో పోల్చుకుంటే భారతీయ అమెరికన్ల ఓటింగ్ 9శాతం పెరిగిందని, అదే సమయంలో జపనీస్ అమెరికన్ల ఓటింగ్ 4శాతం పెరిగిందని సదరు బ్లాగు పోస్టు తెలిపింది. ఏఏపీఐ కమ్యూనిటీ మొత్తం 2020 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పాలుపంచుకుందట. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలో నుంచే ఈ కమ్యూనిటీ వారు ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు కనబడుతోందని పరిశోధకులు చెప్పారు.
ఈ విషయంపై ఏఏపీఐ డేటా డైరెక్టర్ కార్తిక్ రామకృష్ణన్ మాట్లాడారు. రెండో తరం వలసదారులు అంటే వలస వచ్చిన తల్లిదండ్రులు కలిగి ఉన్న వారు ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నారని ఆమె తెలిపారు. కరోనా, ఆసియన్ అమెరికన్లపై విద్వేష దాడుల వంటి సంక్లిష్ట పరిస్థితులు వీరిపై ప్రభావం చూపాయని చెప్పిన ఆమె.. దీనికితోడు అత్యున్నత ఆసియన్ అమెరికన్ పదవి కోసం కమలా హ్యారిస్ పోటీ పడటం, అలాగే చాలా చోట్ల కూడా ఇలానే ఆసియన్ అమెరికన్లు పోటీలో ఉండటంతో ఏఏపీఐ కమ్యూనిటీ ఓటింగ్ వైపు అడుగులు వేసిందని పేర్కొన్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత మంది ఆసియా అమెరికన్లు ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.






