ఈసారి భిన్నంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం
అమెరికా 46వ అధ్యక్షునిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం గతంలో ఎన్నడూ కనివినీ రీతిలో భిన్నంగా జరగబోతోంది. అంటే అంగరంగ వైభవంగా అనుకునేరూ..కానే కాదు..చాలా సాధారణంగా ఈ కార్యక్రమం సాగనుంది. కరోనా కారణంగా అతి తక్కువ మంది అతిధుల నడుమ, జన సమూహాం పెద్దగా లేకుండా చాలా నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సాధారణంగా అగ్ర రాజ్యంలో అధ్యక్ష పదవీ స్వీకరణ సమయంలో పెద్ద ఎత్తున అనుచర గణం, దేశ విదేశాల అతిధులు, ప్రముఖులు, ముఖ్యులు, సామాజిక వాదులు, లాబీయిస్టులతో యూఎస్ క్యాపిటల్ వేదికగా సంబంరంలా జరిగే ఈ వేడుక.. ఈసారి మాత్రం సాదాసీదాగా ముగియనుంది. అత్యంత భద్రతా వలయంలో బైడెన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇది కూడా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చలవే. ఆయన ఎన్నికను తిరస్కరించిన ట్రంప్ మద్దతుదారులను ఉసిగొల్పడంతో క్యాపిటల్ భవనంపై దాడులు జరిగి, నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రమాణ స్వీకార ప్రాంతం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తమ మద్దతు దారులను కూడా ఇంట్లోనే ఉండాలని బైడెన్ బృందం ఆదేశాలు జారీ చేయడంలో సాదాసీదాగా ఈ ప్రమాణ స్వీకారం జరగుతుంది.






