KA Paul: నా కొడుకును యూఎస్ ప్రెసిడెంట్‌గా చూడలని ఉంది: కేఏ పాల్

అమెరికా రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ (K. A. Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమెరికాను కాపాడాలంటే మూడో పార్టీ అవసరం ఉందని, ప్రస్తుతం అందరి దృష్టి అమెరికన్ పార్టీపైనే (American Party) ఉందని అన్నారు. గతంలోనే అమెరికాలోని ప్రముఖులతో కలిసి కొత్త పార్టీ పెట్టాలని తాను ప్రతిపాదించానని పాల్ చెప్పారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. “మస్క్ దగ్గర డబ్బు ఉంది.. నాకు ఫాలోయింగ్ ఉంది” అని పేర్కొన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో డీల్ కుదిరితే మస్క్ మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉందన్నారు. అమెరికాలో మూడో పార్టీ అవసరం ఉందని, అది ఏర్పడి తీరుతుందని పాల్ నొక్కి చెప్పారు. అలాగే తన కుమారుడు అమెరికాలోనే పుట్టి పెరిగాడని, అతన్ని యూఎస్ ప్రెసిడెంట్‌గా (US President) చూడాలని కోరిక ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.