అమెరికా ప్రభుత్వంపై భారతీయుల దావా
తాము పని చేసే కంపెనీలు చేసిన మోసానికి తమను బాధ్యులను చేస్తూ వీసా నిరాకరించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయమై ఏకంగా అమెరికా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని ఓ ఫెడరల్ కోర్టులో 70 మంది ఐటీ నిపుణులు కేసులు దాఖలు చేశారని ఓ నివేదిక వెల్లడించింది. ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ కార్యక్రమం (ఓపీటీ) ద్వారా అమెరికాలోని నాలుగు ఐటీ కంపెనీలు కొందరు విదేశీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాయి. అయితే ఓపీటీ ద్వారా కొన్ని కంపెనీలు మోసానికి పాల్పడ్డాయని సదరు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్ (డీహెచ్ఎస్) చెప్తున్నది. అయితే కంపెనీలు చేసిన తప్పులకు తామెలా బాధ్యులమవుతామని, అమెరికా ప్రభుత్వం బాధితుల పక్షాన ఉంటూ వారికి సాయం చేయాలని బాధితులు వాదిస్తున్నారు.






