పుతిన్ తో ఆచితూచి అడుగులు
వాషింగ్టన్ః రష్యా అధినేత లాదిమిర్ పుతిన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, సమతూకం పాటించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. పుతిన్‌తో ఒక పక్క దౌత్యపరమైన సంబంధాలు కొనసాగిస్తూనే మరొక పక్క కఠిన వైఖరి అవలంబించాలని ఆయన ఆలోచిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికన్నా బైడెన్ కాలంలో పుతిన్‌తో సంబంధాలు భిన్నంగా ఉండబోతున్నాయి. పుతిన్‌ను చూసి ట్రంప్ మైమరచిపోయేవారు. ఆయన ఆమోదం తీసుకునే వారు. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే, అంతా 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని అనుమానించేవరకూ వెళ్లింది. గత ఏడాది పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమయింది.
కొంత రాజీ ధోరణిని ప్రదర్శించినప్పటికీ, ఆయన ప్రభుత్వం రష్యా పట్ల కఠిన వైఖరి అనుసరించకపోలేదు. ఆ దేశం మీద ఆంక్షలు కూడా విధించింది. ఉక్రెయిన్ నుంచి ఇంధన సరఫరాలు, అసమ్మతి వర్గీయులపై దాడులు వగైరాల వరకు అనేక అంశాలపై రష్యా కంపెనీల మీదా, వాణిజ్య దిగ్గజాల మీదా ఆంక్షలు విధించడం జరిగింది. ట్రంప్ మాదిరిగా రష్యాతో సంబంధాల పునరుద్ధరణకు బైడెన్ ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఆశలేవీ చూపించడం లేదు. తమ మాజీ ప్రచ్ఛన్న యుద్ధ శత్రువుతో ఆయన తమ విభేదాలను పరిష్కరించుకోవాలని గానీ, సంబంధాలను మెరుగుపరుచుకోవాలని గానీ ఏమాత్రం భావించడం లేదు. అది అంత అవసరంగా కూడా ఆయన అనుకోవడం లేదు. స్వదేశంలో అనేక సమస్యలను శీఘ్రంగా పరిష్కరించుకోవాల్సి ఉన్నందువల్ల, ఇరాన్, చైనాల విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందువల్ల ఆయన ప్రస్తుతానికి ప్రత్యక్ష ఘర్షణకు కూడా సిద్ధంగా లేరు.






