ఓక్ బ్రూక్ ట్రస్టీ ఎన్నికల్లో డాక్టర్ సురేష్ రెడ్డి బృందం ఘనవిజయం
అమెరికాలోని చికాగోలో ఓక్ బ్రూక్ విలేజ్ ట్రస్టీ ఎన్నికల్లో ప్రవాస భారతీయ వైద్యులు డాక్టర్ సురేష్ రెడ్డి బృందం ఘనవిజయం సాధించింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఎన్నికల్లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షులు సురేష్ రెడ్డి గెలుపొందారు. ఆయన బృందంలోని లారెన్స్ ‘ల్యారీ’ హెర్మాన్, జేమ్స్ పి. నేగిల్ కూడా ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఓక్ బ్రూక్ ట్రస్టీ సభ్యులుగా మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. వీటికోసం ఆరుగురు పోటీ పడ్డారు. వీరిలో సురేష్ రెడ్డి బృందం తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. హెర్మన్, నేగిల్ ఇద్దరి వద్ద ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నాయని, ఓక్ బ్రూక్ ప్రాంతంపై ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని సురేష్ రెడ్డి తెలిపారు. ఆ నమ్మకం ఉండబట్టే వారిద్దరితో కలిసి పోటీలో పాల్గొన్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఓక్ బ్రూక్ ప్రజలకు, అలాగే తనకు అండగా నిలిచిన మేయర్, పరిపాలనా బృందానికి సురేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య పాలసీలకు బోర్డులో అనుమతులు లభించేలా కృషి చేస్తానని, ఆమోదం పొందిన పాలసీలను సిబ్బంది కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రాక్టీస్‌లో ఉన్న ఒక పిజీషియన్‌గా తన నైపుణ్యాలు, అనుభవం మొత్తాన్ని దీనికోసం ఉపయోగిస్తానని తేల్చిచెప్పారు. స్థానికంగా చాలా మంది నిపుణులైన వైద్యులున్నారని, ప్రజల భద్రత కోసం వారందరినీ కూడా అవసరమైతే అందుబాటులో ఉండేలా చూస్తానని చెప్పారు. ఈ క్రమంలో సురేష్ రెడ్డికి ఓక్ బ్రూక్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపాల్ లాల్మలాని, బోర్డు సభ్యులు మొయీన్ సయీద్ ఎన్నికల సమయంలో బాగా మద్దతులపలికారు. స్థానిక ప్రజలకు సురేష్ రెడ్డికి ఉన్న నాయకత్వ లక్షణాల వల్ల మేలు కలుగుతుందని వారు పేర్కొన్నారు.






