Donald Trump : డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరిక.. భారత్, చైనాలపై

భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ఇటీవల కాంగ్రెస్ ఉభయసభల సమావేశంలో పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు (Tariffs) విధిస్తోందని ఆరోపించారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భారత్ (India), చైనా (China) లపై మా ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2న భారీస్థాయిలో అమలవుతాయి అని పేర్కొంటూ భారత్‌ను అధిక సుంకాల దేశంగా ట్రంప్ అభివర్ణించారు. కెనడా (Canada) అత్యధికంగా సుంకాలు విధిస్తోందని ఒవల్ కార్యాలయంలో కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తూ ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 2న విధించే సుంకాలు అమెరికా దశను మార్చనున్నాయని అన్నారు. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ( బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.