Washington: ‘ఒబామా అరెస్టు’.. ట్రంప్ ఏఐ వీడియో వెనక ఉద్దేశమేంటి..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓవల్ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు ఒబామా (Barack Obama)ను అరెస్టు చేస్తున్నట్లుగా ఏఐ సాయంతో రూపొందించిన వీడియో (AI Video) అది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అనే మెసేజ్ ఇస్తూ మాజీ అధ్యక్షుడిపై ట్రంప్ (Donald Trump) విమర్శలు గుప్పించారు.
ఆ వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ.. ‘చట్టానికి అధ్యక్షుడు అతీతుడే’ అని అన్నట్లుగా ఉంది. ఆ వెంటనే పలువురు రాజకీయ నాయకులు ‘చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు’ అని మాట్లాడినట్లు ఉంది. చివరకు ఓవల్ ఆఫీసులో ట్రంప్, ఒబామా మాట్లాడుకుంటుండగా ఎఫ్‌బీఐ అధికారులు అక్కడికి వచ్చి మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఈ వీడియోను రూపొందించారు. ఆ సమయంలో ట్రంప్ నవ్వుతూ కన్పించారు. అనంతరం ఒబామా ఖైదీ దుస్తుల్లో జైల్లో కూర్చుని ఉన్నట్లు చూపించడంతో వీడియో ముగుస్తుంది.
ఈ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా భారీఎత్తున మోసాలకు పాల్పడ్డారంటూ ట్రంప్ ఇటీవల ఆరోపించారు. దాన్ని ఉద్దేశిస్తూనే అధ్యక్షుడు తాజా వీడియో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
గతవారం యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పాలనను నియంత్రించేందుకు ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని ఆమె అన్నారు. ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ తప్పుడు వాదన తెచ్చారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు. ఒబామా హయాంలో పనిచేసిన వారందరినీ విచారించాలని తులసీ గబ్బార్డ్ పిలుపునిచ్చారు.