Madman Theory :మ్యాడ్‌మ్యాన్ థియరీతో ట్రంప్ దూకుడు.. మిత్రదేశాల్లో కలవరం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన రెండోసారి అధ్యక్ష పదవిలో అనుసరిస్తున్న ఈ అనూహ్య వైఖరే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ (Iran)పై దాడి చేస్తారా అని గత నెల అడిగినప్పుడు, చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనేం చేస్తానో ఎవరికీ తెలియదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చలకు రెండు వారాల సమయం ఇస్తున్నట్లు ప్రపంచాన్ని నమ్మించి, ఆ తర్వాత ఉన్నట్లుండి బాంబులతో విరుచుకుపడ్డారు. ఇదే ఆయన నూతన విదేశాంగ విధానం. రాజకీయ నిపుణులు దీనిని మ్యాడ్‌మ్యాన్ థియరీ (Madman Theory )గా అభివర్ణిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (London School of Economics )కు చెందిన ఒక ప్రొఫెసర్ ప్రకారం రిచర్డ్ నిక్సన్ తర్వాత అత్యంత కేంద్రీకృత విదేశాంగ విధానాన్ని ట్రంప్ రూపొందించారు. దీనివల్ల అన్ని నిర్ణయాలు ట్రంప్ వ్యక్తిగత అభిరుచులు, స్వభావంపైనే ఆధారపడి ఉంటాయి. తన ఈ అంతుచిక్కని తత్వాన్ని ట్రంప్ ఒక రాజకీయ ఆస్తిగా, వ్యూహాత్మక అస్త్రంగా మార్చుకున్నారు. తాను మానసికంగా ఎలాంటి చర్యకైనా సిద్ధమని శత్రువులను నమ్మించి, వారి నుంచి ప్రయోజనాలు పొందడమే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం.
ట్రంప్ విధానం మిత్రదేశాలపై బాగానే పనిచేస్తోందనడానికి నాటో దేశాలే నిదర్శనం. నాటో చార్టర్‌లోని ఆర్టికల్ 5 ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే అన్ని సభ్యదేశాలు రక్షించాలి. ఈ నిబద్ధతపైనే ట్రంప్ మొదట సందేహాలు రేకెత్తించారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలవాలని అవమానించారు. డెన్మార్క్ పరిధిలోని గ్రీన్‌లాండ్‌ను సైనిక బలంతో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో భయపడిన నాటో సభ్య దేశాలన్నీ తమ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 2.5% నుంచి ఏకంగా 5%కి పెంచాయి. దశాబ్దాలుగా ఏ అమెరికా అధ్యక్షుడు సాధించలేనిది ట్రంప్ సాధించారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే లాంటి నేతలు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, ఈ మ్యాడ్‌మ్యాన్ థియరీ శత్రుదేశాలపై పనిచేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ బెదిరింపులకు గానీ, పొగడ్తలకు గానీ లొంగడం లేదు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ సిద్ధంగా లేరని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయం మరింత ఎదురుదెబ్బ తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.