బ్యాంకులకు డొనాల్డ్ ట్రంప్ టోకరా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ట్రంప్ ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసగించారని, తప్పుడు మార్గాల్లో భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్మించుకున్నారని న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ తేలిపారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్ దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యంపై న్యాయమూర్తి విచారణ జరిపి, తీర్పు వెలువరించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు, తద్వారా రుణాల కోసం ట్రంప్, ఆయన కంపెనీ అవకతవకలకు పాల్పడ్డారని తీర్పులో ప్రస్తావించారు. ఆస్తుల విలువను కాగితాలపై ఎక్కువ చేసి చూపించారని, లేని ఆస్తులు ఉన్నట్లు నమ్మించారని పేర్కొన్నారు. ఆయా నేరాలకు గాను శిక్ష కింద ట్రంప్‌నకు చెందిన కొన్ని బిజినెస్ లైసెన్స్‌లను రద్దు చేయాలని జడ్జి ఎంగోరాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.






