Donald Trump: మస్క్ పై ట్రంప్, ఇంట్రస్టింగ్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య వాతావరణం చల్లబడే సంకేతాలు కనపడుతున్నాయి. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ఏకపక్షంగా సహకరించిన మస్క్, ఆ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్న ఈ ఇద్దరి స్నేహం ఆ తర్వాత చెడింది. ట్రంప్ విధానాలను మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో కూడా మస్క్.. ట్రంప్ ను వ్యతిరేకించారు.
ఇదే టైం లో మస్క్ ఓ రాజకీయ పార్టీకి కూడా శ్రీకారం చుట్టడం సంచలనం అయింది. దీనిపై ట్రంప్ పెదవి విరిచారు. అమెరికాలో మూడవ రాజకీయ పార్టీ ఎప్పటికీ సక్సెస్ కాదని కామెంట్ చేసారు. ఇది ఇలా కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ కు మద్దతు ఇచ్చే ఆ పార్టీ నేతలు, అమెరికా(America)లో మస్క్ వ్యాపారాలను నాశనం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మస్క్ వ్యాపారాలను నాశనం చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదని, మస్క్ అమెరికాలో వ్యాపారం చేయాలని వ్యాఖ్యానించారు.
ఈ నెల ప్రారంభంలో, మస్క్ కంపెనీలు ఫెడరల్ ప్రభుత్వం నుండి పొందే బిలియన్ల డాలర్ల సబ్సిడీలను నిలిపివేస్తామని ట్రంప్ బెదిరించారు. అలా కామెంట్ చేసిన ట్రంప్.. లేటెస్ట్ గా సబ్సిడీల విషయం పక్కన పెట్టిన ట్రంప్.. తాను మస్క్ వ్యాపారాలను నాశనం చేస్తానని అందరూ అంటున్నారని.. కాని అది కరెక్ట్ కాదని, మన దేశంలో మస్క్ వ్యాపారాలతో పాటుగా ఇతర వ్యాపారాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ది చెందాలని తాను కోరుకుంటున్నాను అని అన్నారు. వారు ఎంత బాగా వ్యాపారాలు చేస్తే అమెరికా అంత బాగుంటుందని అన్నారు. మనం ప్రతి రోజు రికార్డులను క్రియేట్ చేస్తున్నామని, ఇప్పుడు అది అలాగే కొనసాగాలని తాను కోరుకుంటున్నా అని కామెంట్ చేసారు ట్రంప్.