ట్రంప్ నాటో వ్యాఖ్యలు.. ఇంటాబయటా మంటలు
నాటో కూటమి దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచకపోతే వాటిపై దాడి చేయాల్సిందిగా రష్యాను ప్రేరేపిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ఇంటాబయటా దుమారం రేపుతోంది. 74 ఏళ్ల క్రితం ఏర్పడిన ఉత్తర అట్లాంటిక్ కూటమి (నాటో)తో అమెరికా బంధాన్ని పరమ పవిత్రమైన కట్టుబాటుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. అమెరికా మాట ఇచ్చిందంటే దాన్ని నిలబెట్టుకుని తీరుతుందన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ నాటోను కట్టుబాటుగా కాకుండా అనవసర భారంగా చూస్తున్నారని బైడెన్ విమర్శించారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ట్రంప్ సన్నద్ధుడవుతున్న దృష్ట్యా ఆయన వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. నాటో దేశాలు తమ జీడీపీలో 2 శాతాన్ని రక్షణకు వెచ్చించాలని ట్రంప్ డిమాండ్ చేస్తూ వచ్చారు.






